గో సంరక్షణ జీవితంలో భాగం కావాలి
- గో గౌరవ యాత్ర ప్రముఖ్ కిషన్ రెడ్డి
విశ్వంభర, ఇనుగుర్తి: గోవుల సంరక్షణ మన జీవితంలో భాగం కావాలని, ఆవులను కాపాడుకోవడం మనందరి బాధ్యతని గోమాత గౌరవ ప్రచార యాత్ర ఐదు జిల్లాల ప్రముఖ్, ఇంచార్జ్ భూనేటి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. గోమాత గౌరవ ప్రచార యాత్ర శుక్రవారం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా హాజరైన వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గోవుల మందల కోసం రాజులు యుద్ధాలు చేసే వారిని ఆవుల గొప్పదనం, పవిత్రత,విశిష్టత అంత గొప్పదన్నారు.గోవు ఉన్న ప్రతి ఇల్లు ఆరోగ్యంతో, లక్ష్మీ కటాక్షంతో ఉంటుందన్నారు. దేశంలో సంపూర్ణ గృహత్య నివారణ, గో సేవ కోసం చట్టం చేసి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, గో పరిరక్షణ బోర్డు,గో ఆధారిత పంచగవ్య ఉత్పాదనల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను ఈనెల 27న,రాష్ట్రవ్యాప్తంగా ఆయా మండలాలలో తహసిల్దార్లకు గోసంరక్షణపై గో ప్రేమికులు, సంరక్షకులు, రైతులు సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నేత, గో ప్రేమికులు పంజాల దేవరాజు కవిత దంపతులు, మాజీ ఉపసర్పంచి నాయిని కొమురయ్య యాదవ్, మాదాటి శంకర్ గౌడ్, పంజాల నాగరాజు గౌడ్, పోలోజు వజ్రమ్మ, పోలోజు పుష్పలీల తదితరులు పాల్గొన్నారు.



