సినిమా టికెట్లపై 'కోమటిరెడ్డి' యూ-టర్న్
ఆ జీవోలు మేమంతా కూర్చుని తీసుకున్న నిర్ణయమే
సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట మార్చారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట మార్చారు. తాను సినీ పరిశ్రమ గురించి పట్టించుకోవడమే మానేశానని టికెట్ ధరల పెంపు గురించి వస్తున్న జీవోలకు తనకు ఎలాంటి సంబంధం లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఇవాళ అందుకు భిన్నంగా మాట్లాడారు. టికెట్ ధరల పెంపు నిర్ణయం ప్రభుత్వం సమిష్టిగా తీసుకున్నదేనని వెల్లడించారు.
షరతులతో కూడిన పెంపు
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. గతంలో పుష్ప-2 ఘటన తర్వాత ధరల పెంపు ఉండదని ప్రకటించినప్పటికీ, పరిశ్రమ ప్రయోజనాల దృష్ట్యా ఆ నిర్ణయాన్ని సవరించుకున్నట్లు తెలిపారు. అయితే, పెంచిన ధరలో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమ నిధికి కేటాయించాలనే కఠినమైన షరతును విధించినట్లు పేర్కొన్నారు. ఇటీవల కొన్ని సినిమాల విషయంలో కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసిన సమయంలో తాను నగరంలో లేనందువల్ల పూర్తి సమాచారం అందలేదని వివరణ ఇచ్చారు.
మాకు పని ఉంది.. మీకు లేదు
మంత్రికి తెలియకుండానే జీవోలు ఎలా వస్తాయని ఎద్దేవా చేసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయిన వారికి తమ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బొక్కాబొర్లా పడిందన్నారు. బీఆర్ఎస్ నేతలకు పనిపాట లేదు కాబట్టే ప్రతి విషయంలోనూ బురదజల్లుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం చేయాల్సిన పని చాలా ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల శాఖల్లో జోక్యం చేసుకోరని వైఎస్ఆర్ మాదిరిగా అందరిని కలుపుకుపోతారని చెప్పారు.
ఆయా శాఖల విషయంలో ముఖ్యమంత్రి జోక్యంపై వస్తున్న ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ శాఖలోనూ అనవసరంగా తలదూర్చరని, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగా మంత్రులకు పూర్తి 'ఫ్రీ హ్యాండ్' ఇస్తారని కొనియాడారు. ప్రభుత్వం పారదర్శకంగా ఉందని, విపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల తన నిర్ణయాలను మార్చుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. మొదట తాను ఆ శాఖను పట్టించుకోవడం మానేశాను అని చెప్పి, ఇప్పుడు అంతా కూర్చుని చర్చించాం అనడం చర్చనీయాంశమైంది.



