రైతు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

రైతు రిజిస్ట్రేషన్ తప్పనిసరి


  • ప్రత్యేక డ్రైవ్‌ను సద్వినియోగం చేసుకోవాలి
    ఫరూఖ్ నగర్ తహసీల్దార్ నాగయ్య

విశ్వంభర, ఫరూఖ్ నగర్ : రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలంలో భూమి కలిగిన రైతులందరూ తప్పనిసరిగా రైతు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఫరూఖ్ నగర్ తహసీల్దార్ నాగయ్య తెలిపారు. రైతులు రైతు రిజిస్ట్రేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఐడి నంబరు పొందాలని ఆయన సూచించారు. మండల వ్యవసాయ అధికారి నిషాంత్ కుమార్, ఎంపీడీఓ బన్సీలాల్ సంబంధిత అధికారులు, మీసేవ కోఆర్డినేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని తెలియజేశారు. భవిష్యత్తులో రైతు భరోసా, రైతు బీమా,పీఎం కిసాన్,ఇతర కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడానికి రైతు రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటుందని తెలిపారు.అలాగే ప్రత్తి, వరి కొనుగోలు,పంట రుణాలు మరియు ఇతర వ్యవసాయ సేవలకు రైతు రిజిస్ట్రేషన్ కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.రైతు రిజిస్ట్రేషన్ ద్వారా రైతులు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిని నేరుగా పొందవచ్చని తెలిపారు.పంట కొనుగోలు,పంట రుణాల మంజూరు మరియు ఇతర వ్యవసాయ సేవలను సులభంగా పొందేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు.రైతు రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు,భూమి పట్టా పాసుబుక్ మరియు ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.రైతులు తమ గ్రామ పరిధిలోని రైతు వేదిక వద్ద వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) వద్ద లేదా సమీపంలోని మీసేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు.ఏప్రిల్ 22 నుండి ఏప్రిల్ 30 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడుతున్నందున, రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువులోగా రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని తహసీల్దార్ నాగయ్య విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో ఏఈఓ లు, జీపీఓ లు, మీసేవ కోఆర్డినేటర్ లు పాల్గొనడం జరిగింది

Tags: