జర్నలిస్టులేమైనా ఉగ్రవాదులా? 

రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు

జర్నలిస్టులేమైనా ఉగ్రవాదులా? 

రాష్ట్రంలో జర్నలిస్టుల అరెస్టుల వ్యవహారంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పండుగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జర్నలిస్టుల అరెస్టుల వ్యవహారంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పండుగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. అర్ధరాత్రి వేళ ఇళ్లలోకి చొరబడి అరెస్టులు చేయడాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి వేళ జర్నలిస్టుల ఇళ్లలోకి చొరబడి అరెస్టులు చేయడానికి వాళ్లేమైనా తీవ్రవాదులా? అని ఆయన పోలీసులను, ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులను ప్రభుత్వం తన రాజకీయ వికృత క్రీడలో బలి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.మీడియా, డిజిటల్ మీడియాపై సిట్ లను ప్రయోగించడం ద్వారా ఎవరిని కాపాడుతున్నారు? ఎవరిని వేటాడుతున్నారు? అని హరీశ్ రావు ప్రశ్నించారు.

ప్రజాపాలన అంటే ఇదేనా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హరీశ్ రావు సూటి ప్రశ్నలు సంధించారు. రేవంత్ రెడ్డి.. ఇదేనా మీ ప్రజాపాలన? అంటూ ప్రశ్నించారు. ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని నిలదీశారు. జర్నలిస్టుల ఆత్మగౌరవంపై పనిగట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి ఇది అని హరీశ్ రావు విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం జర్నలిస్టుల ఆత్మగౌరవంతో ఆటలాడుతున్నారని ఎద్దేవా చేశారు. మహిళా ఐఏఎస్ అధికారి, మంత్రికి సంబంధించిన వార్తా కథనాల నేపథ్యంలో జరిగిన ఈ అరెస్టులను హరీశ్ రావు దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. అరెస్టయిన జర్నలిస్టులను ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Read More ప్రజాస్వామ్యమా నీ జాడెక్కడ... మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడుపాక హనుమంతు సంస్మరణ సభలో వక్తల ప్రసంగం