అభివృద్ధి పనులకు శ్రీకారం
- రూ.2.52 కోట్ల తో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాగరాజు
విశ్వంభర, హనుమకొండ: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి, ఆరెపల్లె గ్రామాల్లో సుమారు రూ.2 కోట్ల 52 లక్షల నిధులతో చేపట్టనున్న రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నగర పరిధిలోని గ్రామాలు, కాలనీలలో రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతులు సమగ్రంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందన్నారు. పైడిపల్లి, ఆరేపల్లె గ్రామాల్లో చాలా కాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్ల సమస్యలు, వర్షాకాలంలో ఏర్పడే నీటి నిల్వ సమస్యలను పరిష్కరించేందుకు ఈ అభివృద్ధి పనులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తయిన తర్వాత స్థానిక ప్రజలకు రాకపోకలు సులభతరం అవడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణం నెలకొంటుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడం ద్వారా ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు నాణ్యతగా, త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు, కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే నాగరాజు సూచనలు చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు నిర్వహించాలని, పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి కాలనీ అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ప్రజల సమస్యలను తెలుసుకుని దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జన్ను అనిల్, బుద్దే పెద్దన్న , జన్ను అరుణాకర్, మేకల నవీన్, వంశీ, జన్ను జాన్సన్,అభిషేకం, నవీన్, సతీష్, అంకుశావళి, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.



