మద్యానికి బానిసైన తండ్రి ప్రాణాలు తీసిన కొడుకు
విశ్వంభర, పెద్దపల్లి : పెద్దపల్లి పట్టణంలోని ఈద్గా కాలనీలో మంగళవారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మద్యం వ్యసనానికి బానిసై, డబ్బుల కోసం కుటుంబ సభ్యులను వేధిస్తున్న తండ్రిని కుమారుడే ఇటుకతో కొట్టి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం..ఈద్గా కాలనీకి చెందిన సయ్యద్ జాబేర్ లారీ క్లీనర్‌గా పనిచేస్తుండేవాడు. అతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి, ఆమె సోదరినే రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మొదటి భార్య కుమారుడు, రెండో భార్య పిల్లలు అందరూ కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. పిల్లలు హోటళ్లలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే, జాబేర్ గత కొంతకాలంగా మద్యానికి బానిసై పనికి వెళ్లడం మానేశాడు. పిల్లలు కష్టపడి సంపాదించిన డబ్బులను కూడా మద్యం కోసం అడుగుతూ నిత్యం వారిని శారీరకంగా, మానసికగా వేధించేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం డబ్బుల విషయంలో ఇంట్లో తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. గొడవ ముదరడంతో ఆగ్రహానికి లోనైన 18 ఏళ్ల కుమారుడు ఇంటి వద్ద ఉన్న ఇటుకతో తండ్రి తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమై జాబేర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై లక్ష్మణరావు, సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.



