నిర్మల్ జిల్లా విద్యార్థినికి న్యాయం
: అధికారుల జోక్యంతో కాలేజీకి ఆదేశాలు
విశ్వంభర, జిహెచ్ఎంసి: నిర్మల్ జిల్లాలోని తెలంగాణ ఉన్నాత విద్యా మండలి జోక్యంతో ఓ విద్యార్థినికి న్యాయం జరిగే దిశగా కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. నిర్మల్ జిల్లాలోని జవాహర్ లాల్ నెహ్రూ కాలేజీలో బి. ఎడ్ పూర్తి చేసిన అరెల్లా సహజకు ఫీజులు చెల్లించలేదనే కారణంతో కాలేజీ యాజమాన్యం ఆమె ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సమస్యపై సామాజిక కార్యకర్త కాటపల్లి ఎల్లేష నిరంతరం కృషి చేస్తూ సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. విద్యార్థినికి జరిగిన అన్యాయాన్ని గుర్తించిన అధికారులు కాలేజీ యాజమాన్యానికి ఎలాంటి ఫీజు డిమాండ్ చేయకుండా వెంటనే ఒరిజినల్ సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే, విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు నిలుపుదల చేయడం నిబంధనలకు విరుద్ధమని, అలాంటి చర్యలు కొనసాగితే సంబంధిత కాలేజీపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో కాటపల్లి ఎల్లేష పట్టుదలతో చేసిన ప్రయత్నం ఫలించి, ఒక విద్యార్థినికి న్యాయం జరుగుతున్నందుకు స్థానికులు అభినందించారు.



