ఆసుపత్రి కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి

ఆసుపత్రి కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి

విశ్వంభర, కోఠి : కనీస వేతన బోర్డు సిఫారసులకు ఏడాది గడిచినా అమలు చేయకపోవడం దుర్మార్గం అని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు, కనీస వేతన బోర్డు సభ్యులు ఎం.డి. యూసుఫ్ విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని, లేదంటే సమ్మె తప్పదని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం. నరసింహ హెచ్చరించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కోఠిలోని డీఎంఈ, టీవీవీపీ కార్యాలయాల ఎదుట రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషంట్ కేర్ కార్మికులు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణకు వినతిపత్రాలు సమర్పించారు. కార్మికుల వేతనాలు పెంచాలని కనీస వేతన బోర్డు సిఫారసులు అమలు చేయాలని, ఏజెన్సీ విధానం రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా వేతనాలు చెల్లించాలని, సెలవులు, బోనస్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీబాయి, హసీనా బేగం, వై. ఓమయ్య, పి. సురేష్, ఎ. పార్వతి, సిర్రా దేవేందర్, ఎస్. కిష్టమ్మ, రెహమాన్, శ్రీనివాసులు, బొడ్డుపల్లి కిషన్, మదన్ సింగ్, పి. వరలక్ష్మి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Tags: