కొండెంగకు సిపిఆర్
- ప్రాణం కాపాడిన అసిస్టెంట్ డైరెక్టర్ డా.పెంటయ్య
విశ్వంభర, కోదాడ: సూర్యాపేట జిల్లా మునగాల మండలం భరాఖత్ గూడెం గ్రామానికి చెందిన ఒక రైస్ మిల్లు యజమాని కోతుల బెడదనుండి రక్షించుకోవడానికి నూజివీడు నుండి నాలుగు రోజుల క్రితం ఒక కొండెంగ ని కొనుక్కొని వచ్చారు. వచ్చిన దగ్గర నుండి తిండి తినకుండా పడుకొని నీరసంగా ఉంటుంది. కొత్త ప్రాంతం వలన తినడం లేదేమో లే అని అనుకున్న యజమాని దానిని అంత సీరియస్ గా తీసుకోలేదు. ఈరోజు ఉదయం అకస్మాత్తుగా కొండెంగ కింద పడిపోయి ఒళ్లు చల్లబడి బాడీ బిగదీసుకుపోవడం తో కంగారు పడిన యజమాని వైద్యం కోసం కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకి తరలించారు.కొండెంగను పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా.పి. పెంటయ్య, కొండెంగ యాజమానితో మాట్లాడుతూ.. నాలుగు రోజులుగా తిండి లేకపోవడం అంతకు ముందు సుదూరం ప్రయాణించి రావడం తో ఒంట్లో సత్తువ లేక బీపీ కూడా పడిపోయి శరీర ఉష్ణోగ్రత 90 డిగ్రీలకు పడిపోయి కోమా దశలో ఉన్న కొండెంగ బ్రతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. చికిత్సకు యజమాని ఒప్పుకోవడం తో రక్తం లోకి గ్లూకోజ్ బాటిల్ పెట్టి అత్యవసర స్పందనకోసం స్టెరాయిడ్ ఇంజక్షన్, నరాల సంబంధిత ఔషధాలు ఇచ్చారు. గ్లూకోజ్ నడుస్తుండగా మధ్యలో కొంత తెలివిలోకి వచ్చిన కొండెంగ కి మరలా ఫిట్స్ లాగా వచ్చి గుండె కొట్టుకోవడం ఆగి ఒళ్ళు వేలాడబడడంతో చనిపోయిందని భావించారు. యజమాని. తక్షణమే స్పందించిన అసిస్టెంట్ డైరెక్టర్ కొండెంగకి సీపీఆర్ నిర్వహించి గుండె స్పందన, శ్వాస తిరిగి వచ్చేవరకు కాళ్లు మర్దన చేసి ప్రయత్నించారు.అనంతరం ఇన్ పేషంట్ గా కొండెంగ ను ఆసుపత్రిలోనే ఉంచి మెలకువ వచ్చాక కూడా ఆసరాకోసం కొబ్బరి నీళ్లు తాగించి పర్యవేక్షణలో ఉంచగా మూడున్నర గంటలకు కొండెంగ లేచి కూర్చొని ఆశ్చర్యం కలిగించింది. పోయిన ప్రాణం తిరిగి దక్కిన ఆనందంలో అక్కడ ఉన్నవారి అందరిమొహాల్లోనూ నవ్వులు వచ్చాయి.పూర్తిగా కోలుకున్నాక ఆసుపత్రి నుండి డిశ్చార్జి చేశారు. ప్రాణాలు పోయాయి అనుకున్న కొండెంగ తిరిగి ప్రాణం పోసుకొని తనవెంటతీసుకెళ్లడం ఎంతో సంతోషంగా ఉందని యజమాని తెలిపారు.ఈ చికిత్సలో సిబ్బంది కర్ణ, తదితరులు పాల్గొన్నారు.



