బీజేపీ, బీఆర్ఎస్‌వి సీక్రెట్ దోస్తీలు: మంత్రి శ్రీధర్ బాబు
మున్సిపల్ ఎన్నికల వేళ వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శుక్రవారం తాండూర్, వికారాబాద్ పట్టణాల్లో సుడిగాలి పర్యటన చేశారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల వేళ వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శుక్రవారం తాండూర్, వికారాబాద్ పట్టణాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పట్టణ వాసులతో మమేకమవుతూ.. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధికి వందల కోట్ల నిధులు
వికారాబాద్ పట్టణ అభివృద్ధిపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. ఈ ప్రాంతానికి ఉన్న భౌగోళిక అందాలను, ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని వికారాబాద్‌ను రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇందుకోసం వందల కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. ఇప్పటికే జిల్లాలో 'మొబిలిటీ వ్యాలీ పార్క్' వంటి ప్రాజెక్టులతో పారిశ్రామిక వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు.
దోస్తీపై విమర్శనాస్త్రాలు
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల తీరుపై మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "రాష్ట్రంలో ఆ రెండు పార్టీలది లోపాయికారి ఒప్పందం. బయట విమర్శించుకున్నా, లోపల మాత్రం వారు సీక్రెట్ దోస్తులే" అని ఎద్దేవా చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వారు ఆడుతున్న నాటకాలను ఓటర్లు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఆరు గ్యారెంటీలే మా శ్రీరామరక్ష!
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీ మున్సిపల్ చైర్మన్ పదవులను కైవసం చేసుకుంటామని, తమ ప్రభుత్వం అమలు చేస్తున్న 'ఆరు గ్యారెంటీలే' తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూనే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని, పట్టణాల అభివృద్ధి కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.



