మూడు నెలల్లో కవిత 'కొత్త పార్టీ'

మూడు నెలల్లో కవిత 'కొత్త పార్టీ'

రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే మూడు నెలల్లో పార్టీ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే మూడు నెలల్లో పార్టీ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా చిట్‌చాట్‌లో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు సిద్ధమవుతున్నామని, ఇందుకోసం మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నామని స్పష్టం చేశారు.

ఫోన్ ట్యాపింగ్.. 'పెద్ద చేప' ఎవరు?
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై కవిత ఘాటుగా స్పందించారు. "ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశించిన అసలు 'పెద్ద చేప'ను వదిలేసి, ప్రణీత్ రావు వంటి చిన్న చేపలను పట్టుకోవడం ఏంటి?" అని సిట్ దర్యాప్తును ప్రశ్నించారు. ఈ కేసును ప్రభుత్వం టీవీ సీరియల్‌లా సాగదీస్తోందని, నిందితులను కేవలం డిమోట్ చేసి వదిలేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

Read More చైతన్యపురి డివిజన్ కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

కాంగ్రెస్ వైఫల్యంపై నిప్పులు
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని కవిత ఆరోపించారు. ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పారు. 2025-26 బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి కేటాయింపులు పెరిగినా, ఆశించిన స్థాయిలో రూ.20 వేల కోట్ల లక్ష్యాన్ని చేరుకోలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని, జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు.

కేసీఆర్ చరిత్ర.. రేవంత్ రెడ్డికి సవాల్
తెలంగాణ చరిత్రలో కేసీఆర్ పాత్ర అజరామరమని, ఆయనను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని కవిత వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ విమర్శలు హద్దులు దాటుతున్నాయని, ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదని మండిపడ్డారు. ప్రజలు ప్రశ్నించే గొంతుకలైన స్వతంత్రులకు, సీపీఎం వంటి పార్టీలకు మద్దతు ఇవ్వాలని ఆమె సూచించారు.

12న 'ఆత్మగౌరవ సభ'
తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల కోసం ఈ నెల 12న హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో 'తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ' నిర్వహిస్తున్నట్లు కవిత ప్రకటించారు. ఈ సభ ద్వారా తెలంగాణ వాదులందరినీ ఏకం చేసి, భవిష్యత్తు కార్యచరణను ప్రకటించనున్నారు.