కేసీఆర్ దత్తపుత్రుడు కిషన్ రెడ్డి: సీఎం రేవంత్ రెడ్డి
మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న వేళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.'ప్రజా పాలన – ప్రగతి బాట' కార్యక్రమంలో భాగంగా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న వేళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.'ప్రజా పాలన – ప్రగతి బాట' కార్యక్రమంలో భాగంగా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీరును విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో ముందుకెళ్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. "బీజేపీకి ఓటు వేసినా, బీఆర్ఎస్‌కు ఓటు వేసినా అది మూసీలో వేసినట్లే. ఆ రెండు పార్టీల మధ్య ఉన్నది ఫెవీకాల్ బంధం" అని ఆయన విమర్శించారు. కేసీఆర్‌ను కాపాడటమే కిషన్ రెడ్డి ప్రధాన అజెండా అని, అందుకే ఆయన ఇప్పుడు 'కల్వకుంట్ల కిషన్ రావు'గా మారిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డిని కేసీఆర్ దత్తపుత్రుడిగా అభివర్ణిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
స్మార్ట్ సిటీ ఏది? నిధులు ఏవి?
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను రెండుసార్లు గెలిపించినా జిల్లాకు సాధించిందేమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోదీ మూడుసార్లు ప్రధాని అయినా నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీగా మార్చలేకపోయారని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ మురికికూపంగా మారిందని, కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో బీజేపీ విఫలమైందని ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వని బీజేపీకి, ఇక్కడి ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. మన వార్డుల్లో మన కార్పొరేటర్లు ఉంటేనే నిధుల ప్రవాహం సాధ్యమవుతుందని, అభివృద్ధికి బాటలు పడతాయని ప్రజలకు వివరించారు. "నేను అందరివాడిని.. నాకు కులం, మతం లేదు.. నా లక్ష్యం కేవలం అభివృద్ధి మాత్రమే" అని చెబుతూ, నిజామాబాద్ ఓటర్లు ఈ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇవ్వాలని కోరారు.



