ప్రజల అభివృద్ధే బిజెపి లక్ష్యం
- ఎంపీ రఘునందన్ రావు
విశ్వంభర, సదాశివపేట: ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే పార్టీ బీజేపీ అని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సదాశివపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఎంపీ ప్రసంగించారు. పట్టణంలోని 21 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు నిలబడ్డారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం విశ్వగురువుగా ఎదుగుతోందని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత మోదీ ప్రభుత్వం అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా మున్సిపాలిటీల అభివృద్ధికి భారీ నిధులు తీసుకొస్తామని, సదాశివపేట అభివృద్ధికి రూ.100 కోట్లకు పైగా నిధులు రానున్నాయని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలను మోసం చేశాయని, ఓట్ల కోసం అబద్ధపు హామీలు ఇచ్చాయని ఎంపీ విమర్శించారు. పేదలకు ఇళ్లు ఇస్తామంటూ మాటలకే పరిమితమయ్యారని, 830 సర్వే నంబర్‌లో ఇళ్లు కట్టడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. 2006లో సదాశివపేట ఎలా ఉందో.. 2026లో కూడా అలానే ఉందని అన్నారు. పట్టణ అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని తెలిపారు. కోమటి చెరువు పేరుతో వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ప్రజలకు ఉపయోగం లేకుండా పోయిందని అన్నారు. బీజేపీ నాయకుడు ఓదెల మాణిక్ రావ్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఎక్కడా సమగ్ర అభివృద్ధి జరగలేదని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు తమ స్వార్థం కోసం మాత్రమే పనిచేశారని విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టిందని, ఒక్క హామీ కూడా అమలు కాలేదని అన్నారు. మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరాలంటే ప్రజలు కమలం గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు ఓదెల రాజేశ్వరి, బీజేపీ నేతలు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.



