హైదరాబాద్‌కు ‘మహా’ బడ్జెట్.. రూ. 11,460 కోట్లతో నగరం నయా లుక్!
భాగ్యనగరం మరింత మెరిసిపోనుంది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగరాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్‌ను సిద్ధం చేసింది.
విశ్వంభర, హైదరాబాద్ బ్యూరో: భాగ్యనగరం మరింత మెరిసిపోనుంది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగరాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్‌ను సిద్ధం చేసింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన శనివారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ బడ్జెట్ ముసాయిదాకు కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేశారు. మొత్తం రూ. 11,460 కోట్ల వ్యయంతో నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి కేటాయింపులు గణనీయంగా పెరగడం గమనార్హం.
విలీన మున్సిపాలిటీలకు భారీ ఊతం
నగర శివార్లలోని అభివృద్ధిని పట్టాలెక్కించేందుకు ఈ బడ్జెట్‌లో సింహభాగం కేటాయించారు. పాత జీహెచ్ఎంసీ పరిధిలోని పనుల కోసం రూ. 9,200 కోట్లు కేటాయించగా, నగరంతో కొత్తగా విలీనమైన 27 మున్సిపాలిటీల కోసం ఏకంగా రూ. 2,260 కోట్లు కేటాయించారు. దీనివల్ల శివారు ప్రాంతాల్లో డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల సమస్యలు తీరనున్నాయి.
ట్రాఫిక్ కష్టాలకు చెక్ - రూ. 1,720 కోట్లు
నగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంపై బల్దియా ప్రత్యేక దృష్టి పెట్టింది. కొత్తగా ఫ్లైఓవర్ల నిర్మాణం, అండర్ పాస్ లు, ప్రధాన రహదారుల విస్తరణ, నిర్వహణ కోసం రూ.1,720 కోట్లను కేటాయించారు. ఎస్ఆర్‌డీపీ మలి విడత పనులు ఈ నిధులతో వేగవంతం కానున్నాయి.
పచ్చని భాగ్యనగరం - రూ. 590 కోట్లు
కాలుష్య రహిత హైదరాబాద్ కోసం పచ్చదనం పెంచేందుకు జీహెచ్ఎంసీ భారీ కార్యాచరణను రూపొందించింది. ‘గ్రీన్ బడ్జెట్’ కింద రూ. 590 కోట్లు కేటాయించారు. నగరంలోని ప్రధాన జంక్షన్ల వద్ద లాండ్‌స్కేపింగ్, కొత్త పార్కుల నిర్మాణం, ఉన్న పార్కుల ఆధునీకరణకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.
ముంపు భయం లేని నగరం - రూ. 550 కోట్లు
వర్షాకాలంలో నగరం చిగురుటాకులా వణకకుండా ఉండేందుకు స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్లాన్ కింద రూ. 550 కోట్లు కేటాయించారు. నాలాల పూడికతీత, విస్తరణ పనుల ద్వారా లోతట్టు ప్రాంతాలకు శాశ్వత విముక్తి కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ భారీ బడ్జెట్ అమలుకు అవసరమైన నిధులను ప్రధానంగా ఆస్తి పన్ను, టౌన్ ప్లానింగ్ ఫీజులు, భవన నిర్మాణ అనుమతుల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్ల ద్వారా సమకూర్చుకోనున్నారు. ఆస్తి పన్ను వసూళ్లను మరింత పకడ్బందీగా అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.



