ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ ప్రకటన

33.67% పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ ప్రకటన

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఏను 30.03 శాతం నుంచి 33.67 శాతానికి పెంచుతూ సంబంధిత ఫైల్‌పై ముఖ్యమంత్రి సంతకం చేశారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరనుంది.

జూలై 1వ తేదీ నుంచి అమలు
ఈ డీఏ పెంపు 2023 జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఉద్యోగులు, యూనివర్సిటీ టీచింగ్, నాన్-టీచింగ్ స్టాఫ్‌కు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. పెరిగిన డీఏను ఈ జనవరి జీతంతో కలిపి నగదు రూపంలో చెల్లించనున్నారు. జూలై 2023 నుంచి డిసెంబర్ 2025 వరకు ఉన్న బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ (GPF) ఖాతాల్లో జమ చేయనున్నారు. పదవీ విరమణ పొందిన వారికి బకాయిలను 30 విడతల్లో చెల్లించనున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.227 కోట్ల అదనపు భారం పడనుంది.

Read More సన్ షైన్ పాఠశాలలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ప్రభుత్వం తరపున రూ.1 కోటి ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. పదవీ విరమణ పొందే వారికి అందాల్సిన ఇతర ప్రయోజనాలను కూడా త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. పార్ట్ టైం అసిస్టెంట్లు, వీఆర్ఏలకు నెలకు రూ.100 అదనంగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన
కాగా, జీవో విడుదలకు ముందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. "ఉద్యోగుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మీ దగ్గరకు రావడానికి ముందే డీఏ ఫైలుపై సంతకం చేసి వచ్చాను. దీనికి సంబంధించిన జీవో అధికారికంగా వెలువడుతుంది" అని  సీఎం ప్రకటించారు. పండుగ పూట ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సచివాలయం నుంచి జిల్లాల స్థాయి వరకు ఉద్యోగ సంఘాలు సంబరాలు జరుపుకుంటున్నాయి.