పేదల సొంతింటి కలపై కేంద్రానికి విన్నపం
తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని, రాష్ట్రానికి రావాల్సిన ఇండ్లను మంజూరు చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని, రాష్ట్రానికి రావాల్సిన ఇండ్లను మంజూరు చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్ లో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. పేదల సంక్షేమాన్ని విస్మరించిన గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో కేంద్రం నుండి ఒక్క ఇల్లు కూడా సాధించలేకపోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాలకు ఇళ్లు కేటాయించాలని గత రెండు సంవత్సరాలుగా కేంద్రాన్ని పదేపదే కోరుతున్నట్లు వివరించారు.
5 లక్షల ఇళ్లపై దృష్టి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే రాష్ట్రం అధికారికంగా పీఎంఏవై-జి పథకంలో చేరిందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో గత 12 ఏళ్లలో పెరిగిన డిమాండ్ దృష్ట్యా ఈ ఏడాది 3 లక్షల ఇళ్లు, వచ్చే ఏడాది మరో 2 లక్షల ఇళ్లను ప్రత్యేకంగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఇప్పటికే ఇంటింటికీ విస్తృత సర్వే నిర్వహించి అర్హులైన లబ్ధిదారుల పూర్తి సమాచారాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు. పేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, దీనికి కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అర్హుల గుర్తింపు పూర్తి
కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఆవాస్+2024 మొబైల్ యాప్ ద్వారా మరోసారి సర్వే నిర్వహించి మొత్తం 11.57 లక్షల అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించినట్లు పొంగులేటి కేంద్ర మంత్రికి వివరించారు. డేటాబేస్ పక్కాగా ఉందని, ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు కేంద్రం తోడ్పాటు అవసరమని పేర్కొన్నారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, గ్రామీణ గృహ నిర్మాణ రంగాల్లో ఎదురవుతున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.



