బహిరంగంగా వెళ్తే ‘రహస్యం’ ఎలా అవుతుంది?

బహిరంగంగా వెళ్తే ‘రహస్యం’ ఎలా అవుతుంది?

రాష్ట్ర మంత్రుల మధ్య జరిగిన భేటీపై సోషల్ మీడియా, కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మంత్రుల మధ్య జరిగిన భేటీపై సోషల్ మీడియా, కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల మధ్య జరిగే చర్చలకు రాజకీయ రంగు పులుముతూ ‘రహస్య భేటీ’ అనడం తగదని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.  లోక్ భవన్‌లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమం ముగిసిన తర్వాత అందరి ముందే తామంతా ఒకే కారులో వెళ్లామని, ఇందులో రహస్యమేమీ లేదని ఆయన పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, సన్నద్ధతపై చర్చించేందుకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో సమావేశమయ్యామని వెల్లడించారు. "క్యాబినెట్ అనేది ఒక యూనిట్. పాలనాపరమైన అంశాల్లో జాప్యం లేకుండా చూసుకోవడం సీనియర్ మంత్రులుగా మా బాధ్యత. అందులో తప్పేముంది?" అని ప్రశ్నించారు.

విష ప్రచారం మానుకోండి
రాజకీయ లబ్ధి కోసమే కొందరు కావాలని పనిగట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణాత్మక విమర్శలను స్వాగతిస్తాం కానీ, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని పేర్కొన్నారు. ఊహాజనిత కథనాలతో ప్రభుత్వంపై విషం చిమ్మడం మానుకోవాలి. రాష్ట్రాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని శ్రీధర్ బాబు కోరారు.

Read More  ప్రాణం ఉన్నంతవరకు నిరుపేదలకు సేవ చేస్తాం.- -డా. కోడి శ్రీనివాసులు