గాంధీజీ ఫౌండేషన్ సేవలు అమోఘం.
-ఎంఈఓ ఉట్కూరి సుధాకర్ రెడ్డి.
On
- భగవంతుడు సహాయం చేసే వ్యక్తుల్లో ఉంటాడు....
- ఆర్థికంగా ఉన్నవారు పేదవారిని ఆదుకోవాలి...
- 23వ నెల నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన గాంధీజీ ఫౌండేషన్
విశ్వంభర, చండూర్ :- రెండు సంవత్సరముల వరకు ప్రతినెల 30 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు 2024 జనవరి ఒకటో తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ "నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ" కార్యక్రమం శనివారం నాడు స్ధానిక గాంధీజీ విద్యాసంస్థల యందు 23 వ నెల పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా చండూరు ఎంఈఓ ఉట్కూరి సుధాకర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ భగవంతుడు ఎవరికీ ప్రత్యక్షంగా కనపడడని, సహాయం చేసే వ్యక్తులలోనే భగవంతుడు ఉంటాడని అన్నారు. సమాజంలో చాలామందికి డబ్బులు ఉంటాయని, దానం చేసే గుణం చాలా తక్కువ మందికి ఉంటుందని, ఏదో ఒక నెల కాకుండా 23 నెలల నుండి ప్రతి నెల ఒకటవ తేదీన 30 మందికి నిత్యవసర సరుకులు పంచడం అభినందనీయమని అన్నారు. పనిచేయడానికి శక్తి లేకుండా కుమారులు, కూతుళ్లు లేని ఒంటరి మహిళలే ఎక్కువ మంది కనబడుతున్నారన్నారు. చిన్న వయసులోనే ఇంత పెద్ద దయాగుణం కోడి శ్రీనివాసులుకు ఉండడం అభినందనీయమని అన్నారు. తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు ఏమి తీసుకొనిరామని, మరణించినప్పుడు ఏమి తీసుకపోమని, ఆర్థికంగా ఉన్నవారు ఇటువంటి సమాజ సేవా కార్యక్రమాలు చేయాలని అన్నారు. గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ మా ఫౌండేషన్ 23 నెలలుగా 7,00,000 రూపాయల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను, వేసవికాలంలో చలివేంద్రాన్ని, చనిపోయిన పేద కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని చేస్తూ వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ భార్గవ్, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, బుషిపాక యాదగిరి, బోడ విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు.



