గ్యాస్ కొరత రావొద్దు
- జిల్లా కలెక్టర్ హైమవతి
విశ్వంభర, సిద్దిపేట: గృహావసరాలకు, కేజీబీవీ, గురుకులాలు, సంక్షేమ వసతిగృహాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాలకు కొరత రాకుండా వంట గ్యాస్ సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ హైమవతి గ్యాస్ డీలర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎల్ఫీజీ గ్యాస్ డీలర్లకు సంబంధించిన శాఖల అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది కలగలేదని ఇకముందు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్యాస్ సరఫరా చేయాలని డీలర్లను ఆదేశించారు. సమయానికి గ్యాస్ డెలివరీ అయ్యేలా డెలివరీ బాయ్స్‌ను పర్యవేక్షించాలన్నారు. ఏదైనా సమస్య వస్తే పౌరసరఫరాల అధికారి దృష్టికి తీసుకురావాలని, గ్యాస్ స్టాక్, డెలివరీ రిజిస్టర్‌ను కచ్చితంగా మెయింటైన్ చేయాలని, రెవెన్యూ, సివిల్ సప్లై, విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారన్నారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఒక గ్యాస్ సిలిండర్ తేడా వచ్చిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి తనుజ, డీఈవో శ్రీనివాసరెడ్డి, డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ధనరాజ్, డీడబ్ల్యూవో శారద, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ట్రాన్స్‌పోర్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



