బీసీ హక్కుల కోసం సాంస్కృతిక గర్జన
విశ్వంభర, హైదరాబాదు : బీసీ వర్గాల హక్కుల సాధనకు సాంస్కృతిక ఉద్యమం బలమైన ఆయుధంగా మారాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీ కళామండలి జాతీయ అధ్యక్షుడు రామలింగం అధ్యక్షతన శుక్రవారం హైదరాబాదులోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన “ధూమ్ ధామ్” సాంస్కృతిక కార్యక్రమం ఘనంగా జరిగింది. పాటలు, నృత్యాలు, నాటికల ద్వారా బీసీ వర్గాల సమస్యలను కళాకారులు ప్రజల ముందుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ వర్గాల హక్కుల సాధనకు కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాకుండా సాంస్కృతిక ఉద్యమం కూడా సమాంతరంగా సాగాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కళాకారులు, రచయితలు, గాయకులు బీసీ వర్గాల సమస్యలను పాటల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం జరుగుతున్న బీసీ ఉద్యమానికి సాంస్కృతిక రంగం బలమైన ఆయుధంగా మారగలదన్నారు. బీసీ వర్గాల చరిత్ర, కష్టాలు, హక్కుల కోసం జరుగుతున్న పోరాటాలను పాటల ద్వారా ప్రజలకు చేరవేస్తే ఉద్యమానికి మరింత ఊపు వస్తుందన్నారు. యువత ముందుకు వచ్చి సాంస్కృతిక దళాలను ఏర్పాటు చేసి గ్రామాలు, పట్టణాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కళాకారుల సమస్యలు పరిష్కరిస్తాం కళాకారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆర్ కృష్ణయ్య అన్నారు. కళాకారులు సమాజంలో చైతన్యం కలిగించే కీలక శక్తిగా ఉన్నప్పటికీ వారికి తగిన గుర్తింపు, అవకాశాలు లభించడం లేదన్నారు. కళాకారుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, అర్హులైన కళాకారులకు తప్పకుండా ఉద్యోగాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. కళాకారుల సంక్షేమం కోసం ప్రత్యేక విధానాలు అవసరమని పేర్కొన్నారు. గుజ్జ సత్యం మాట్లాడుతూ పాటలు, నాటికలు ప్రజల మనసులను తాకే శక్తి కలిగి ఉంటాయని అన్నారు. బీసీ ఉద్యమానికి ప్రత్యేక సాంస్కృతిక దళం ఏర్పడితే ప్రజల్లో మరింత చైతన్యం పెరుగుతుందని తెలిపారు. అరుణ్ కుమార్ మాట్లాడుతూ బీసీ చైతన్యం బలపడాలంటే సాంస్కృతిక విప్లవం అవసరమన్నారు. కళాకారులు సమాజంలో మార్పు తీసుకురావడంలో ముందుండాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు కళాకారులు బీసీ హక్కులపై పాటలు పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పలువురు ఉద్యమకారులు, కళాకారులు, బీసీ సంఘాల నేతలు నీల వెంకటేష్, అనంతయ్య, రాజేందర్, సతీష్, రాందేవ్ మోడీ , బీసీ ప్రతినిధులు , వివిధ జిల్లాల కళాకారులు పాల్గొన్నారు.



