మైక్రో ఫైనాన్స్ మోసాలపై సీఐడీ విచారణ చేయాలి

మైక్రో ఫైనాన్స్ మోసాలపై సీఐడీ విచారణ చేయాలి

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: మైక్రో ఫైనాన్స్ పెట్టుబడుల పేరుతో గిరిజనులను మోసం చేసిన వారిపై సీఐడీ విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మానాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాం నాయక్ డిమాండ్ చేశారు. హైదరాబాదు బాగ్‌లింగంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి నష్టపోయిన గిరిజనులను రక్షించే చర్యలు చేపట్టాలని కోరారు. నల్లగొండ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో కొంతమంది ఏజెంట్లు అధిక వడ్డీల ఆశ చూపించి వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. ఈ వ్యవహారంలో పలుకుబడి కలిగిన రాజకీయ నేతలు, ప్రభావశీల వ్యక్తుల పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా తండాల్లో మైక్రో ఫైనాన్స్ పేరుతో డబ్బులు వసూలు జరుగుతున్నప్పటికీ అధికారులు, పోలీసు వ్యవస్థ పట్టించుకోలేదని విమర్శించారు. ఈ పరిస్థితుల వల్ల గిరిజనులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, గత నెల రోజుల్లోనే నలుగురు మృతి చెందినట్లు తెలిపారు. దేవరకొండ, మిర్యాలగూడ, హాలియా పరిసర తండాల్లో కొంతమంది ఏజెంట్లు కలిసి ఒక్కో తండా నుంచి కోటి నుంచి రూ.60 కోట్ల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారని చెప్పారు. చైన్ లింక్ విధానంలో సేకరించిన డబ్బులు తిరిగి లభించే పరిస్థితి లేక బాధితులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలపై సమగ్ర సీఐడీ విచారణ జరిపించాలని, బాధ్యుల ఆస్తులను స్వాధీనం చేసుకొని బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇతర గిరిజన సంఘాలతో కలిసి నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

Tags: