గిట్టుబాటు ధరల హామీతో చట్టం అవసరం

గిట్టుబాటు ధరల హామీతో చట్టం అవసరం

విశ్వంభర, హైదరాబాదు: వ్యవసాయ ప్రణాళికను శాస్త్రీయంగా అమలు చేసి, గిట్టుబాటు ధరలకు చట్టబద్ధ హామీ ఇవ్వాలి. కౌలు రైతులకు రక్షణ, పంటల బీమా అమలు అత్యవసరమ ని తెలంగాణ రైతు సంఘం నాయకత్వం పేర్కొంది. హైదరాబాదు లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర 3వ మహాసభల్లో 32 తీర్మానాలు ఆమోదించి, 93 మంది సభ్యులతో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పోతినేని సుదర్శన్ రావు, ప్రధాన కార్యదర్శిగా తీగల సాగర్, కోశాధికారిగా మూడ్ శోభన్ ఎన్నికయ్యారు. మహాసభలో మహిళా రైతులకు భూహక్కులు, మార్కెట్ చట్ట సవరణ, గిడ్డంగుల సౌకర్యం, పత్తి మార్కెట్ అక్రమాల నియంత్రణ, పామాయిల్, మిర్చి, పసుపు, మామిడి రైతుల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై తీర్మానాలు ఆమోదించినట్లు తెలిపారు. కార్యాచరణ ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా పంటల కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నట్లు తెలిపారు. మ్యానిఫెస్టో హామీల అమలు, కౌలు రైతులకు హక్కుపత్రాలు, అటవీ హక్కుల చట్టం అమలు, పాల రైతుల బిల్లుల చెల్లింపు వంటి అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో లెల్లెల బాలకృష్ణ, ఉడతా రవీందర్ పాల్గొన్నారు.

Tags: