ఈ నెల 27 నుండి మే 23 వరకు అవగాహన కార్యక్రమం
రైతులు సద్వినియోగం చేసుకోండి. డాక్టర్ ఎన్.లింగయ్య
విశ్వంభర, త్రిపురారం : నల్గొండ జిల్లా రైతాంగానికి వ్యవసాయ శాస్త్రవేత్తల సేవలు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు ” కార్యక్రమం ఘనంగా ప్రారంభం కానుంది అని డాక్టర్ ఎన్.లింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం 27 ఏప్రిల్ 2026 నుండి 23 మే 2026 వరకు నల్గొండ జిల్లాలోని 40 గ్రామాల్లోనిర్వహించబడుతుంది. రైతుల పొలాల వద్దకే శాస్త్రవేత్తలు చేరుకుని, ప్రస్తుత కాలానికి అనుగుణమైన ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల నిర్వహణ, నేల ఆరోగ్యం, నీటి వినియోగ సమర్థత, పురుగుమందుల సక్రమ వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. రైతులకు శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి మార్గదర్శనం చేయడం, విత్తనాల ఎంపిక నుండి దిగుబడుల పెంపు వరకు సాంకేతిక సలహాలు అందించడం, పంటలలో తలెత్తే సమస్యలకు తక్షణ పరిష్కారాలు సూచించడం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే పద్ధతులు తెలియజేయడం, రైతుల ఆదాయాన్ని పెంచే మార్గాలను సూచించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయానికి చెందిన అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు, వ్యవసాయ విస్తరణాధికారులు పాల్గొని రైతులతో ప్రత్యక్షంగా మమేకమై వారి సందేహాలకు సమాధానాలు అందిస్తారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ వ్యవసాయ విధానాల్లో శాస్త్రీయ మార్పులను తీసుకురావాలని కోరడమైనది.



