జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
- హైదరాబాదులో ఎన్‌యుజేఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం
విశ్వంభర, చిక్కడపల్లి : ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో మీడియా ఫోర్త్ పిల్లర్‌గా కీలక పాత్ర పోషిస్తోందని, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాదులో ప్రారంభమయ్యాయి. చిక్కడపల్లిలో నిర్వహించిన ఈ సమావేశాలను మంత్రి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు జాతీయ స్థాయి సమావేశం నిర్వహించడం శుభపరిణామమని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు రెండు రోజులపాటు సమస్యలపై విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. అర్హులైన జర్నలిస్టులకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. జర్నలిస్టుల సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ల ఝాన్సీ రెడ్డి, సురేష్ శర్మ, త్రియగ్ నారాయణ, పురుషోత్తం నారగౌని, తోకల అనిల్ కుమార్, నాగేశ్వరరావు, మెరుగు చంద్రమోహన్, రాజు పటేల్, అరుణ్ కుమార్, పావుశెట్టి శ్రీనివాస్, కందికొండ మోహన్, చిర్రగోని ఉదయ్ దీర్, ఉప్పలంచి నరేందర్, పోచంపల్లి రజిత, నాగరాజు, శ్రీనాథ్, అవునురి సంపత్, గట్టు మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు



