రైతులకు నష్టపరిహారం అందజేత

రైతులకు నష్టపరిహారం అందజేత

విశ్వంభర, చింతపల్లి:  చింతపల్లి మండలం వర్కాల గ్రామంలో శివన్నగూడెం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం చెక్కులను శుక్రవారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పంపిణీ చేశారు. ఎమ్మార్వో కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వర్కాల గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 173 పరిధిలో భూములు కోల్పోయిన 17 మంది రైతులకు మొత్తం రూ.3 కోట్ల 4 లక్షల 50 వేల విలువగల చెక్కులను ఎమ్మెల్యే రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం రైతుల పట్ల అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తోందని, భూములు కోల్పోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా నష్టపరిహారం అందిస్తున్నామని తెలిపారు. రైతులు అందుకున్న నష్టపరిహారాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని తమ కుటుంబ భవిష్యత్తును బలోపేతం చేసుకోవాలని సూచించారు. దేవరకొండ నియోజకవర్గంలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి అయితే వ్యవసాయం అభివృద్ధి చెందడంతో పాటు ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ఆయన పేర్కొన్నారు. రానున్న మూడు సంవత్సరాలలో అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీరు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రాజెక్టుల కారణంగా భూములు కోల్పోయిన రైతులకు పునరావాసం కల్పించడంతో పాటు, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుతో పాటు డిండి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి రైతులకు శాశ్వత సాగునీటి సదుపాయం కల్పిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమణా రెడ్డి, ఎమ్మార్వో విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాగభూషణం, నాయకులు ముచ్చర్ల యాదగిరి, కొండూరి పవన్, వెంకటయ్య గౌడ్, చింతపల్లి సర్పంచ్ కాసారపు శ్వేత శ్రీనివాస్, వర్కాల సర్పంచ్ కుర్మేటి పుష్పలత ప్రశాంత్, రైతులు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags: