సీఎం టూర్‌పై కలెక్టర్ సమీక్ష
విశ్వంభర, సిద్దిపేట: నంగునూరు మండలం నర్మెట గ్రామంలో ఏర్పాటు చేసిన ఆయిల్‌ఫామ్ పరిశ్రమను సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 22, ఆదివారం ప్రారంభించనున్న నేపథ్యంలో సోమవారం ఆయిల్ ఫామ్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ హైమావతి, సీపీ రష్మీ పెరుమాళ్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పర్యటన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం హెలికాప్టర్ ద్వారా పరిశ్రమ వద్దకు చేరుకుంటారని, అదే రోజు జిల్లా జైలు భవనాన్ని కూడా ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక తదితర శాఖలచే 120స్టాళ్లను ఏర్పాటుచేసి మార్చి 20, 21, 22 తేదీల్లో ఫ్యాక్టరీ ఆవరణలో రైతు మహోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో వ్యవసాయశాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రైతు మేళాకు ప్రతీ రోజు 3వేల నుంచి 5వేల మంది రైతులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తాగునీరు, భోజన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని డీపీఓకు సూచించారు. వైద్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. హెలీప్యాడ్ ఏర్పాట్లు ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నిబంధనలకు అనుగుణంగా చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సీపీ సాధన రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, కార్యక్రమానికి విధులు నిర్వహించే సిబ్బంది అందరూ పోలీస్ శాఖ ద్వారా జారీ చేసే ఐడీ కార్డులు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. మీడియా ప్రతినిధుల కోసం కూడా ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హెలిప్యాడ్ నుంచి సభాస్థలికి ఇతర ఏర్పాట్లను, ఆర్టీసీ బస్సులు, అధికారులు, విఐపీల పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు కుశాల్కర్, సుభాష్ చంద్రబోస్, ఆర్డీవో సదానందం, వ్యవసాయ, ఉద్యానవాన, పశుసంవర్ధక, పంచాయతీ, మిషన్ భగీరథ, ఆర్అండ్బీ, సమాచార పౌర సంబంధాలశాఖ, ఆయిల్‌ఫెడ్, ఫైర్ సేఫ్టీ, విద్యుత్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.



