ఆ జీవోను ర‌ద్దు చేయండి.. సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ

ఆ జీవోను ర‌ద్దు చేయండి.. సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ

సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని, ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు.

సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని, ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. రాజ్యాంగంపై ప్రమాణంచేసి రాజ్యాంగ హక్కులనే ఉల్లంఘించిన కేసీఆర్, కేటీఆర్‌లు ఎమ్మెల్యే పదవులకు అనర్హులని, తెలంగాణ శాసనసభా నాయకుడిగా ఉన్న మీరు కేసీఆర్, కేటీఆర్ లను అనర్హులుగా ప్రకటించే విషయంపై స్పీకర్‌కు లేఖ రాయాలని సూచించారు. 

కాళేశ్వరం మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగకుండా అటకెక్కించే కుట్రలు జరుగుతున్నాయని సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ రెండు అంశాలపై విచారణ జరిగితే కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాలకోసం ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరగకుండా ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు ఉన్నాయని, భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తమ దృష్టికి వచ్చిందని సంజయ్ లేఖలో ప్రస్తావించారు. 

Read More ఎమెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ మధ్య తోపులాట

ఫోన్ ట్యాపింగ్ అత్యంత తీవ్రమైన నేరమని, ప్రజాప్రతినిధులకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రసాదించిన హక్కులనుకూడా ఫోన్ ట్యాపింగ్‌తో కాలరాశారని, వ్యాపారులు సెలబ్రిటీలను బెదిరించి డబ్బులు వసూలు చేయడంతోపాటు తమ అవసరాలను తీర్చుకున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి ప్రత్యేకంగా పరికరాలు తెప్పించారని, బీఆర్ఎస్ ఓడిపోయాక ఫోన్ ట్యాపింగ్ పరికరాల ధ్వంసం పేరుతో దేశ భద్రతకు, ఉగ్రవాదులకు సంబంధించిన కీలకమైన డేటాను కూడా ధ్వంసం చేశారని తెలిపారు. 

ఫోన్ ట్యాపింగ్ ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకున్నా ఎందుకు స్వదేశానికి రప్పించలేకపోయారని బండి సంజయ్ ప్రశ్నించారు. వాస్తవాలు నిగ్గు తేలాలంటే సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు జోక్యం అనివార్యమని, సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాయాలని సీఎంను కోరారు. ప్రతిపక్షాలపై సైబర్ దాడికి కారకుడైన మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్‌లకు నోటీసులిచ్చి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.