బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలి

బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలి

విశ్వంభర, ముషీరాబాదు : రాష్ట్ర బడ్జెట్‌లో మధ్యాహ్న భోజన పథకానికి కేటాయింపులు పెంచాలని, వంట కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తూ పోరాటం చేస్తానని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఎఐటియుసి అనుబంధ సంఘం తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాదు ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన  మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు 54,200 మంది వంట కార్మికులకు 24 సంవత్సరాలుగా తక్కువ వేతనం ఇవ్వడం అన్యాయమన్నారు. హక్కుల సాధన కోసం కార్మికులు ఉద్యమాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం వంట కార్మికులకు నెలకు 10 వేల రూపాయల వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ బి.వి.విజయలక్ష్మి మాట్లాడుతూ కోర్టు తీర్పు ప్రకారం నెలకు 17 వేల రూపాయల వేతనం అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని కోరారు. పి.ప్రేంపావని మాట్లాడుతూ వంట కార్మికులకు నిత్యావసర సరుకులు ప్రభుత్వం సరఫరా చేయాలని, లేబర్ డిపార్ట్‌మెంట్ ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జంపాల రవీందర్, పూసాల రమేశ్, డి.కమలారెడ్డి, టి.చక్రపాణి, కె.సుగుణ, కుంటాల రాములు, రామకృష్ణ, లక్ష్మణ్, రంగారెడ్డి, పాటకుల కళావతి, సామల రమ, సమ్మక్క, సాయమ్మ, బాలరాజ్, బి.లక్ష్మి, శ్రీదేవి, తాల్లూరి లక్ష్మి, ఇందిరా, సరస్వతి, పద్మ పాల్గొన్నారు.

Tags: