ప్రమాదాల నియంత్రణ అందరి బాధ్యత

ప్రమాదాల నియంత్రణ అందరి బాధ్యత

  •  జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

విశ్వంభర, సంగారెడ్డి: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు.ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని  24,  26, వార్డుల్లో  పోలీస్, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన “అరైవ్ – అలైవ్” అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో అవగాహన పెంపొందించి వారిని భాగస్వాములుగా చేసుకునే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం “అరైవ్ – అలైవ్” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని తెలిపారు. హైవేలపై  వాహనాలు అధిక వేగంతో నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగు తున్నాయని పేర్కొన్నారు.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని, అది ప్రాణాలను రక్షించే శిరస్త్రాణమని అన్నారు. కారులో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ ధరించడం తప్పనిసరి అని సూచించారు. వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, లైసెన్స్ పొందిన తరువాత మాత్రమే వాహనాలు నడపాలని సూచించారు. ఇంటి పెద్దలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పిల్లలకు మంచి ఉదాహరణగా నిలవాలని కోరారు. జిల్లా మొత్తాన్ని ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ముఖ్యంగా హైవేలపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, సంవత్సరానికి 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. టూ వీలర్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఒకే బైక్‌పై ముగ్గురు, నలుగురు ప్రయాణించడం ప్రమాదకరమని హెచ్చరించారు. సంగారెడ్డి పట్టణంలో మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల ప్రమాద సమయంలో ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుందని,  పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భద్రతా నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని సూచించారు.అడిషనల్ కలెక్టర్ పాండు మాట్లాడుతూ, మైనర్లకు వాహనాల తాళాలు ఇవ్వకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని, బయటకు వెళ్తూ హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకోవాలని అన్నారు. ప్రతి కుటుంబం రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలతో రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం హెల్మెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వనిత సంతోష్, సబ్ కలెక్టర్ ఉమా హారతి, వార్డు కౌన్సిలర్లు, పోలీస్ అధికారులు, ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు.

Tags: