రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం


  • నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి

విశ్వాంభర, పెద్ద శంకరంపేట:  రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు.  శనివారం శంకరంపేట్ మండల కేంద్రంలో  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రైతులు పండించిన వరి ధాన్యానికి సరైన ధర లభించేలా ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు. గ్రేడ్-ఎ రకం వరికి క్వింటాల్‌కు రూ. 2389, సాధారణ రకానికి రూ. 2369 మద్దతు ధర నిర్ణయించి రైతుల వద్ద నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు మధ్యవర్తుల బారిన పడకుండా, పారదర్శకంగా వేగవంతంగా కొనుగోలు ప్రక్రియ సాగేందుకు ఈ కేంద్రాలు దోహదపడతాయని చెప్పారు. రైతులు తమ ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఈవో రవీందర్, స్థానిక సర్పంచ్ జంగం రేణుక, నారాయణ గౌడ్ , మధు, మురళి పంతులు సుభాష్ గౌడ్ రాజేందర్ గౌడ్  కుంట్ల రాములు ప్రజాప్రతినిధులు,అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: