విద్యుత్ శాఖ ఉద్యోగులకు మద్దతు
- ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు
-విశ్వంభర, మహబూబాబాద్: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్, అన్మ్యాన్డ్, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మహబూబాబాద్ కరెంట్ ఆఫీస్ కార్యాలయ ఆవరణలో విద్యుత్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికులకు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కార్మికులకు ఆర్టిజన్లుగా గుర్తించి రెగ్యులర్ జీతాలు ఇచ్చి వారి కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్నారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు దృష్టికి మీ సమస్యలను తీసుకెళ్లి ప్రభుత్వంపైన ఒత్తిడి తెచ్చే విధంగా కోట్లాడుతామని హామీ ఇచ్చారు. కార్మికులు తమ ప్రధాన డిమాండ్లుగా విద్యా అర్హతల ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగుల కన్వర్షన్, ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు, టీజీఎన్పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్లో అన్మ్యాన్డ్ వర్కర్లను ఆర్టిజన్లుగా విలీనం చేయాలని కోరారు. అలాగే 2016కు ముందు అర్హతలు కలిగి పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని, పీస్ రేట్ కార్మికులకు జీవో నంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 24000 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో ఎన్నో ఏండ్లుగా పని చేస్తున్నారు, వారిని పర్మినెంట్ చేయాలన్నారు. ఆరు నెలల క్రితం వారి డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసులు కూడా ఇచ్చారని, అయినా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, సరియైన జీతం లేక చాలి చాలని జీతాలతో కుటుంబాలు గడవక ఇప్పటి వరకు 200 మంది కార్మికులు చనిపోయారని రవీందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఉద్యోగ పరమైన హక్కుల కోసం నోటీసులు ఇచ్చి సమ్మె చేస్తుంటే వారిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 1000 మంది కార్మికులను టర్మినేషన్ చేయడం జరిగిందని ఇది దారుణమని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మండిపడ్డారు



