అసలు యుద్ధం ఇప్పుడే ప్రారంభమైంది: ఉద్ధవ్ థాకరే
విశ్వంభర, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ తమను రాజకీయంగా నిర్వీర్యం చేశామని భావిస్తే అది వారి భ్రమ మాత్రమేనని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ తమను రాజకీయంగా నిర్వీర్యం చేశామని భావిస్తే అది వారి భ్రమ మాత్రమేనని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. ఇది ముగింపు కాదని, అసలు పోరాటం ఇప్పుడే ప్రారంభమైందని ఆయన గట్టిగా హెచ్చరించారు. బీజేపీ అనుసరిస్తున్న రాజకీయ కుట్రలు, అవకతవకలను త్వరలోనే ప్రజల ముందుకు తీసుకొస్తామని ఉద్ధవ్ థాకరే ప్రకటించారు.
ముంబైలో శివసేన (యూబీటీ) నుంచి మేయర్‌ను నియమించాలన్నదే తన కల అని, ఆ కల నెరవేరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ఆయన భావోద్వేగంగా తెలిపారు. ముంబై ప్రజల హక్కులను కాపాడటమే తన లక్ష్యమని, ఆ నగరాన్ని పూర్తిగా తాకట్టు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. స్థానిక ఎన్నికల్లో జరిగిన అక్రమాల వల్లే బీజేపీ విజయం సాధించిందని ఆయన ఆరోపించారు. కుట్రపూరితంగా, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ ఆ పార్టీ ముందుకు వెళ్లిందని మండిపడ్డారు.
ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఉద్ధవ్ థాకరే, తమ పార్టీకి ప్రజల నుంచి బలమైన మద్దతు లభించిందని చెప్పారు. మొత్తం 227 స్థానాలు ఉన్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో శివసేన (యూబీటీ) 64 స్థానాలు గెలుచుకోవడం చిన్న విషయం కాదని పేర్కొన్నారు. బీజేపీ 89 స్థానాలు, శివసేన (షిండే) వర్గం 27 స్థానాలు సాధించినప్పటికీ, ప్రజల మనసులు తమవైపేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో నిజమైన పోరాటం ఇంకా ముందుందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు శివసేన (యూబీటీ) వెనకడుగు వేయదని ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. ముంబై భవిష్యత్తు కోసం, ప్రజల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తేల్చి చెప్పారు.



