Maoists: మావోయిస్టులకు మరో బిగ్ షాక్..!!
Maoists: ఆపరేషన్ కగార్ అమలుతో మావోయిస్టు ఉద్యమానికి వరుసగా తీవ్ర ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజా పరిణామంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో పోలీసు ఉన్నతాధికారుల ఎదుట ఏకంగా 63 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయారు.
Maoists: ఆపరేషన్ కగార్ అమలుతో మావోయిస్టు ఉద్యమానికి వరుసగా తీవ్ర ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజా పరిణామంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో పోలీసు ఉన్నతాధికారుల ఎదుట ఏకంగా 63 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. వీరిలో 18 మంది మహిళా మావోయిస్టులు ఉండటం గమనార్హం. పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న మోహన్ కడ్తీ తన భార్యతో కలిసి పోలీసుల ముందుకు రావడం ఈ ఘటనకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. లొంగిపోయిన మావోయిస్టులు తమ వద్ద ఉన్న ఆయుధాలను కూడా పోలీసులకు అప్పగించారు.

ఈ రోజు లొంగిపోయిన మావోయిస్టులపై మొత్తం కలిపి సుమారు రూ.కోటి మేర రివార్డు ఉందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘లోన్ వర్రాటు’ (ఇంటికి తిరిగి రండి) అనే పునరావాస ప్రచారం ప్రభావంతోనే వీరంతా హింసను వీడి ప్రధాన స్రవంతిలోకి రావడానికి ముందుకు వచ్చారని అధికారులు తెలిపారు.
మావోయిస్టుల నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళ్తోంది. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు సమస్యను శాశ్వతంగా అంతమొందిస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ లక్ష్య సాధన కోసం ఆపరేషన్ కగార్‌ను అమలు చేస్తోంది. దీని ఫలితంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావం దాదాపుగా పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే కొంత మేర ప్రభావం మిగిలి ఉండటంతో, అక్కడ భద్రతా బలగాలు మరింత కఠిన చర్యలు చేపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్ర పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు కలిసి నిరంతర కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఈ చర్యలలో వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుని వందలాది మంది మావోయిస్టులు హతమయ్యారు. మరోవైపు వేలాది మంది మావోయిస్టులు ఇప్పటికే ఆయుధాలు విడిచి ప్రభుత్వానికి లొంగిపోయారు.
లొంగిపోయిన వారికి ప్రభుత్వం గతంలో ప్రకటించిన రివార్డులను అందజేయడమే కాకుండా పునరావాసం, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. మావోయిస్టులు హింస మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో చేరి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పలుమార్లు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. భద్రతా బలగాల కఠిన చర్యలతో పాటు ప్రభుత్వం తీసుకుంటున్న పునరావాస విధానాల వల్ల మావోయిస్టు ఉద్యమం బలహీనపడుతోంది. పలువురు అగ్రనేతలు ఎన్‌కౌంటర్లలో మరణించగా, కీలక నేతలు లొంగిపోయారు. మరికొందరు అరెస్టుల పాలయ్యారు. ఈ పరిణామాలు మావోయిస్టు ప్రభావం పూర్తిగా క్షీణించే దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తున్నదని సూచిస్తున్నాయి.



