మార్చి 31 నాటికి నక్సలిజం అంతం: అమిత్ షా
ఈ ఏడాది మార్చి 31 గడువు నాటికి దేశం నుండి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది మార్చి 31 గడువు నాటికి దేశం నుండి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దులోని కర్రిగుట్ట కొండల్లో గతేడాది వేసవిలో నిర్వహించిన ఆపరేషన్ గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 45 డిగ్రీల ఎండలో, అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితుల మధ్య 21 రోజుల పాటు దళాలు వెనకడుగు వేయకుండా పోరాడాయని కొనియాడారు. ఈ క్రమంలో 31 మంది మావోయిస్టులను హతమార్చిన భద్రతా దళాల సాహసాన్ని అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారు.
సీఆర్పీఎఫ్ దినోత్సవంలో కీలక వ్యాఖ్యలు
ఈశాన్య ప్రాంతంలో తొలిసారిగా నిర్వహించిన 87వ సీఆర్‍పీఎఫ్ దినోత్సవ పరేడ్‌లో అమిత్ షా పాల్గొన్నారు. ప్రస్తుతం దేశంలో అంతర్గత భద్రత మెరుగుపడిందని, జమ్మూకశ్మీర్‌లో రాళ్లదాడుల ఘటనలు పూర్తిగా మృగ్యమయ్యాయని పేర్కొన్నారు. మణిపూర్‌లోనూ జాతి హింస ప్రస్తుతం నియంత్రణలో ఉందని వివరించారు. దేశ సరిహద్దులతో పాటు అంతర్గత శాంతిభద్రతల పరిరక్షణలో సీఆర్‍పీఎఫ్ పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమని కొనియాడారు. నక్సలిజం ఒకప్పుడు 12 రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో విస్తరించి ఉండేదని, దానిని తుదముట్టించాలన్న కేంద్ర సంకల్పాన్ని భద్రతా దళాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నాయని చెప్పారు.
రెడ్ టెర్రర్ నుంచి విముక్తి దిశగా
మావోయిస్టులను గట్టి దెబ్బ తీయడంలో సీఆర్‍పీఎఫ్, కోబ్రా దళాలు అత్యంత కీలక పాత్ర పోషించాయని అమిత్ షా వివరించారు. కేవలం మూడు సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే ఈ క్లిష్టమైన లక్ష్యాన్ని సాధించే దిశగా చేరువయ్యామని పేర్కొన్నారు. దేశాన్ని ‘రెడ్ టెర్రర్’ నుంచి విముక్తి చేయడంలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న జవాన్ల సేవలను స్మరించుకున్నారు. నక్సలిజం ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతున్నాయని, త్వరలోనే దేశం ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.



