భక్తుల ఇంటికే  సీతారామచంద్రుల తలంబ్రాలు

భక్తుల ఇంటికే  సీతారామచంద్రుల తలంబ్రాలు

  • గోడ పత్రిక ఆవిష్కరించిన టీజీఎస్ఆర్టీసీ వీసీ, ఎండీ నాగిరెడ్డి

విశ్వంభర, హైదరాబాద్:  శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం నిర్ణయించింది. శ్రీ రామనవమి' సందర్భంగా మార్చి 27న  జరిగే వేడుకలను దృష్టిలో ఉంచుకుని, వివిధ కారణాల వల్ల భద్రాచలం వెళ్లలేని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.  ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములవారి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది. ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాల ప్యాకెట్లు' పొందాలనుకునే భక్తులు www.tgsrtclogistics.co.in వెబ్ సైట్లో లాగిన్ అయి ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.  శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తులకు టీఎస్ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుంది. హైదరాబాద్లోని బస్ భవన్లో శనివారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్ను  వీసీ, ఎండీ వై.నాగిరెడ్డి ఆవిష్కరించారు. విశిష్టమైన ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని మూడేళ్ళ క్రితమే టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు 040-23450033,  040-69440069లలో సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ  సీటీఎం(మార్కెటింగ్ & కమర్షియల్) శ్రీధర్, లాజిస్టిక్ ఏటిఏం రాజన్, భాను తదితరులు పాల్గొన్నారు.

Tags: