ప్రతిభావంతుల గుర్తింపే ప్రభుత్వ లక్ష్యం
విశ్వంభర,సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పేరిట గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను గుర్తించి, ప్రతిభ గల క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందజేస్తోందని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, యువజన క్రీడల అభివృద్ధి అధికారి జంగపల్లి వెంకట నర్సయ్య చెప్పారు. ప్రతిభను గుర్తించి శిక్షణ ఇవ్వడానికి శిక్షకుల నియామకం చేపడుతున్నట్టు తెలిపారు. సీఎం కప్ రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలను రంగనాయక సాగర్ ప్రాజెక్టుపై శ్రీనివాస్ రెడ్డి, వెంకట నరసయ్యలు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రారంభ సమావేశంలో వారు మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి, శారీరక ఎదుగుదలకు ఉపయోగపడుతాయని చెప్పారు. పోటీల ద్వారా గ్రామస్థాయి నుంచి ప్రతిభావంతులను గుర్తిస్తామన్నారు. విద్యార్థులు, యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఒలంపిక్ స్థాయికి ఎదగాలని సూచించారు. రాష్ట్ర స్థాయి సైకిల్ పోటీలకు రాష్ట్రంలోని 33జిల్లాల నుంచి సుమారు 400 మంది విద్యార్థులు, యువకులు పాల్గొన్నారన్నారు. అనంతరం క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. క్రీడలు రెండు రోజులపాటు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో జిల్లా సైకిల్ అసోసియేషన్ అధ్యక్షుడు బండారుపల్లి శ్రీనివాస్, కోశాధికారి చింతకింది శ్రీనివాస్, జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ సెక్రటరీ సౌందర్య, ఖేలో ఇండియా కోచ్ సంజీవ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇరిగేషన్ మంగారెడ్డి, సిద్దిపేట్ రూరల్ సీఐ శ్రీనివాస్, చిన్నకోడూర్ ఎస్ఐ చంద్రమోహన్, చంద్లాపూర్ సర్పంచ్ శేఖర్ సైక్లిస్టులు తదితరులు పాల్గొన్నారు.



