కామారెడ్డికి వచ్చేందుకు బీజేపీ నేతల యత్నం.. అడ్డుకున్న పోలీసులు

కామారెడ్డికి వచ్చేందుకు బీజేపీ నేతల యత్నం.. అడ్డుకున్న పోలీసులు

విశ్వంభర,నిజామాబాద్: కామారెడ్డిలో ఎమ్మెల్యే కేవీఆర్, షబ్బీర్​అలీ మధ్య ఆరోపణలు.. ప్రత్యారోపణలు  రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. స్థానికంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయమై బీజేపీ, కాంగ్రెస్​ నాయకులు మూడు రోజులుగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు.  శనివారం స్థానిక శిశుమందిర్​ వద్ద కలుద్దామని సవాల్​ విసురుకున్నారు. దీంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యేకు మద్దతుగా బీజేపీ నేతలు కామారెడ్డి పట్టణానికి రావాలని నిర్ణయించారు.  జిల్లాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కామారెడ్డికి బయలుదేరిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్​ రావును హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.  నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, భిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.  ఎమ్మెల్యే కేవీఆర్​కు మద్దతుగా మాట్లాడేందుకు హైదరాబాద్​ నుంచి ఎమ్మెల్యే రాకేష్​రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి కామారెడ్డికి బయలు దేరారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు  వారిని మేడ్చల్​ వద్ద అడ్డుకున్నారు. కామారెడ్డికి వెళ్తే ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగే అవకాశం ఉంటుందని పోలీసులు వారికి నచ్చజెప్పారు. అనంతరం వారిని అక్కడి నుంచి తరలించారు.

Tags: