పదో తరగతి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలి
- జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
విశ్వంభర,సూర్యాపేట: పదో తరగతి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. కలెక్టరేట్ సమీక్ష సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాల భద్రత, రవాణా, సీలింగ్ అన్‌సీలింగ్ విధానం, పరీక్షా కేంద్రాల్లో పర్యవేక్షణ, ఫ్లయింగ్ స్క్వాడ్ల సమన్వయం వంటి అంశాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలు ఎటువంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాల న్నారు. జిల్లాలో మొత్తం 12403 మంది విద్యార్థులు, 69 పరీక్షా కేంద్రాలలో పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో తాగునీరు, విద్యుత్, శుచిమందిరాలు, ఫర్నిచర్, ఫస్ట్ ఎయిడ్ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించబడుతున్నాయని తెలిపారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం స్క్రైబ్ సౌకర్యం, అవసరమైన చోట వీల్‌చైర్లు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. పరీక్షలను నిబంధనల ప్రకారం ప్రశాంతంగా నిర్వహించేందు కు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, అసిస్టెంట్ కమిషనర్ ప్రభుత్వ పరీక్ష విభాగం సీనయ్య,చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



