42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి : ఆర్. కృష్ణయ్య
విశ్వంభర, హిమాయత్ నగర్ : బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలను
నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్లలో 61 శాతం, కార్పొరేషన్లలో 58 శాతం, సర్పంచ్‌లలో 53 శాతం బీసీలు గెలిచారని ప్రభుత్వం చెబుతోందని, అయితే చట్టబద్ధత లేకుండా రక్షణ ఉండదని అన్నారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న 42 శాతం రిజర్వేషన్ కేసును త్వరితగతిన విచారించాలని డిమాండ్ చేశారు. గత ఏడాదిగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు, ధర్నాలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, సత్యాగ్రహాలు, రాష్ట్ర బంద్ వంటి కార్యక్రమాలు నిర్వహించినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. బీసీ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ఈ పోరాటం ప్రజా ఉద్యమంగా మారిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కోర్టుల తీర్పులు వచ్చినప్పటికీ, తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల రక్షణ కోసం బలమైన ఉద్యమం సాగుతోందన్నారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న 42 శాతం రిజర్వేషన్ కేసును త్వరితగతిన విచారించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్, ఉపాధ్యక్షులు గుజ్జసత్యం , రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిళ్ళ సతీష్, రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, రాష్ట్ర బీసీ ఐక్య వేదిక అధ్యక్షుడు అనంతయ్య, రాష్ట్ర బీసీ,ఎస్సీ,ఎస్టీ హాస్టల్ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పర్లగోర్ల మోడీరాందేవ్, రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు రాజేందర్, భీం రాజు అంజి గౌడ్, శివకుమార్ యాదవ్, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



