బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
- బీసీ హక్కుల సాధన సమితి ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు
విశ్వంభర, హిమాయత్ నగర్ : కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు ఇచ్చిన అన్ని హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాదు హిమాయత్ నగర్ లో పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయబండి పాండురంగాచారితో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉంటామని ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు ప్రస్తుత బడ్జెట్‌లో బీసీలకు రూ.55 వేల కోట్లు కేటాయించాలని, ఆ నిధులను పూర్తిగా బీసీల సంక్షేమానికే వినియోగించాలని కోరారు. బీసీ విద్యార్థులకు విదేశీ విద్య కోసం ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు అందిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని సూచించారు. ప్రతి మండల కేంద్రంలో 50 దుకాణాలతో కూడిన బీసీ బజార్లు ఏర్పాటు చేసి చేతివృత్తుల వారికి ఉచితంగా దుకాణాలు కేటాయిస్తామని చెప్పిన ప్రకటనకు అనుగుణంగా ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర జనాభాలో 56 శాతం ఉన్న బీసీలు అభివృద్ధి చెందకపోతే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదన్నారు. మిగత దశాబ్దంగా వివిధ బీసీ సంఘాలు, బీసీ హక్కుల సాధన సమితి క్షేత్రస్థాయిలో చేసిన పోరాటాల ఫలితంగా ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో 61 శాతం విజయం సాధించారని, అది బీసీ చైతన్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పిటీసీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఇందుకు రాష్ట్రంలోని బీజేపీ నేతలు తమ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి బీసీలకు న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమితి నాయకులు శ్రీనివాస్, అంజమ్మ, ధనమ్మ పాల్గొన్నారు.



