బీసీల అవకాశాలపై ప్రభుత్వ దాటవేత ఇంకెంతకాలం?'
విశ్వంభర, హైదరాబాదు: బీసీలకు ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు కేటాయిస్తామన్న ప్రభుత్వ హామీ అమలు కావడం లేదని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ విమర్శించారు. శనివారం బాగ్ లింగంపల్లి కార్యాలయంలో బీసీల బడ్జెట్, రాబోయే గ్రేటర్, పరిషత్ ఎన్నికల్లో ప్రాతినిధ్యం పెంపు అంశాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ తులసి శ్రీమాన్, మహిళా ముఖ్య కార్యదర్శి పోశాల సరస్వతి సంయుక్తంగా అధ్యక్షత వహించారు. దాసు సురేశ్ మాట్లాడుతూ గత రెండు బడ్జెట్లలో బీసీల కోసం రూ. 20,600 కోట్లు ప్రతిపాదించగా కేవలం రూ. 3,500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. ఐదేళ్లలో లక్ష కోట్లు అంటే మొత్తం రాష్ట్ర బడ్జెట్‌లో కేవలం 6 శాతం మాత్రమేనని, ప్రస్తుత ఖర్చు రేటును బట్టి చూస్తే ఐదేళ్లలో ఒక శాతం కూడా దాటే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రివర్గం, నామినేటెడ్ పదవులు, ప్రమోషన్లు, కీలక రంగాల్లో బీసీల ప్రాతినిధ్యం నామమాత్రంగా ఉందన్నారు. 42 శాతం రిజర్వేషన్ల హామీ అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బీసీ కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో ఉండగా, బడ్జెట్ నిధులు బడా కాంట్రాక్టర్లకే మళ్లిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్లు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యునైటెడ్ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ వీ జీ ఆర్ నారగోని మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలులో చెప్పేది కొండంత చేసేది గోరంతగా మారిందన్నారు. రాష్ట్రంలో బీసీల రాజకీయ చైతన్యం పెరిగిందని, హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు, దళితులు, మైనార్టీలు సంఘటితంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ దుర్గయ్య గౌడ్, యువ నాయకులు గుండేటి శ్రీధర్, గ్రేటర్ హైదరాబాద్ మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీలత, గ్రేటర్ హైదరాబాద్ సీనియర్ నాయకులు మంద వెంకటస్వామి, బొమ్మ నరేందర్ మంద ఈశ్వర్ అడ్వకేట్ సుదర్శన్, జోగు శ్రీనివాస్, మల్కాజ్గిరి జిల్లా బిసి రాజ్యాధికార సమితి నాయకులు శోభ, ఆనంద్, జ్యోతి, ఎల్లయ్య, మధుసూదనా చారి, పోలీస్ అధికారి రవీందర్, వడ్డేపల్లి జనార్ధన్, రంగయ్య తదితరులు పాల్గొన్నారు



