ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
విశ్వంభర, హైదరాబాదు: ఉద్యమకారుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ ప్రొఫైల్ రాంరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం గన్ పార్క్‌లో అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అయన మాట్లాడారు. ఉద్యమకారుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి హెల్త్ కార్డు, 100 ఎకరాల్లో స్మృతివనం, 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ తదితర వసతులు కల్పించాలని కోరారు. తెలంగాణ సాధనలో ఉద్యమకారుల పాత్ర కీలకమని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల కోసం సబ్ కమిటీ కాకుండా శాశ్వత సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారం, పది రోజుల్లో కార్యాచరణ రూపొందించాలని కోరారు. అమరవీరుల సాక్షిగా ఉద్యమకారుల హక్కుల కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రసాద్, సుజ్జి రాణి, అంజలి, నరసయ్య, స్వరూప, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.



