సంత్ సేవాలాల్ బోధనలు స్ఫూర్తిదాయకం 

సంత్ సేవాలాల్ బోధనలు స్ఫూర్తిదాయకం 

  •  ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

విశ్వంభర, సంగారెడ్డి:  సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గిరిజనుల సంక్షేమానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామని తెలిపారు.పటాన్ చెరు మండలం భానూరు పరిధిలోని బిడిఎల్‌లో సంత్ సేవాలాల్ మహారాజ్ దేవాలయ నిర్మాణానికి రూ.15 లక్షల సొంత నిధులు అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. శనివారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో సంత్ సేవాలాల్ మహారాజ్  జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మైత్రి మైదానం నుంచి జిఎంఆర్ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.  ఎమ్మెల్యే మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బోగ్ బండార్ కార్యక్రమం కూడా నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకే దక్కిందన్నారు. గిరిజనులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ప్రాధాన్యత పెరిగిందని, విద్యార్థులకు ప్రత్యేక ఉపకార వేతనాలు అందిస్తున్నామని తెలిపారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని వెలిమెల, కొల్లూరు, రాళ్లకత్వ, ఐలాపూర్, కొత్తపల్లి తండాల్లో సొంత నిధులతో శ్రీ భవానీ మాత–సేవాలాల్ మహారాజ్ దేవాలయాలను నిర్మించినట్లు గుర్తుచేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్సవ సమితి ప్రతినిధులు ఎమ్మెల్యేను సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, బంజారా సంక్షేమ సంఘం, బంజారా ఉద్యోగ సంఘం ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

Tags: