రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం  

రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం  

   విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలో యూరియా దొరక్క రైతుల అవస్థలు వర్ణనాతీతం. పంటకాలం అయిపోతుండగా, ఇంకా యూరియా దొరక్క, ఏమి చేయాలో తెలీక రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.  యూరియా కొసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడగా, వచ్చే యూరియాలో 60 శాతం మార్క్ ఫెడ్, మిగతా 40 శాతం డీలర్లకు కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. మార్క్ ఫెడ్ తాను తీసుకున్న యూరియాను తన పరిధిలోని పిఏసిఎస్ కేంద్రాలకు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలకు రవాణా ఖర్చులు తానే భరించి సప్లై చేస్తుంది. ఈ కేంద్రాలలో ఎమార్పీ ధరకే అమ్మగలుగుతున్నారు. దీని పైన హమాలీ చార్జీలు కూడా వసూలు చేస్తున్నాయి. డీలర్లకు కంపెనీలు మాత్రం రవాణా ఖర్చులు డీలర్లనే భరించమంటున్నాయి. దీనివల్ల డీలర్లు యూరియా బస్తా ధరను రవాణా ఖర్చులు కలుపుకుని అమ్మాల్సి వస్తుంది. ఈ ధర వ్యత్యాసం వల్ల రైతులు ఎరువులను అధిక ధరలకు కొనాల్సి వస్తుంది. ఆన్ లైన్ వ్యవస్థలో అమ్మకాలు అన్నప్పుడు అందరికీ ఒకే ధర నిర్ణయించాలి, కానీ ఇలా ధరల్లో వ్యత్యాసం ఎందుకు అని మండల రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం పై ఇటు ప్రభుత్వం, అటు ఎరువుల కంపెనీలు రైతులను, డీలర్లను అయోమయానికి గురిచేస్తున్నాయి. దీని గురించి ప్రభుత్వం సమీక్ష చేసి రైతులకు యూరియా సమయానికి అందుబాటులో ఉండేలా , అధిక ధరల భారం పడకుండా తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Tags: