ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ
విశ్వంభర,ఇనుగుర్తి: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 112 మంది వార్డు సభ్యులకు ఈ నెల 17 నుంచి 21వరకు జరిగిన శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. పంచాయతీరాజ్ చట్టం,24 అంశాలపై శిక్షకులు అవగాహన కల్పించారు. ఎంపీడీవో బండారు పార్థసారథి మాట్లాడుతూ గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని వార్డు సభ్యులకు సూచించారు. తమ వార్డులలో ఉన్న మౌలిక వసతులు, విద్యుత్, తాగునీరు,మురుగు కాలువలు, పారిశుద్ధ్యం వంటి సమస్యలను ఎప్పటికప్పుడు సమావేశాలలో చర్చించుకుంటూ సర్పంచ్ దృష్టికి తీసుకువస్తూ పరిష్కారానికి ప్రయత్నించాలన్నారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడానికి గ్రామ పంచాయతీ సమావేశాలలో తగిన సూచనలివ్వాలని పేర్కొన్నారు. భేషజాలకు పోకుండా ప్రజలకు అవసరమైన పనులను చేయడంలో కీలకంగా వ్యవహరించాలని చెప్పారు. ప్రజా సంక్షేమ పథకాలను అర్హులకు అందే విధంగా చూడాలన్నారు. శిక్షణ పొందిన వార్డు సభ్యులకు ట్రైనింగ్ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో టిఒటిలు వినోద్ కుమార్,సత్తయ్య,రామారావు,సుమంత్,అలీ, ముజఫర్ తదితరులు పాల్గొన్నారు.



