భారత్‌లో విమానాల తయారీ

భారత్‌లో విమానాల తయారీ

భారత్‌ను గ్లోబల్‌ ఏవియేషన్‌ హబ్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. దేశీయ దిగ్గజ సంస్థ అదానీ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌, బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎంబ్రయర్‌ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. 

విశ్వంభర, నేషనల్ బ్యూరో: భారత్‌ను గ్లోబల్‌ ఏవియేషన్‌ హబ్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. దేశీయ దిగ్గజ సంస్థ అదానీ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌, బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎంబ్రయర్‌ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు మంగళవారం అధికారికంగా వెల్లడించారు. ఈ ఒప్పందంలో భాగంగా భారత్‌లోనే ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశంలో చిన్న మరియు డొమెస్టిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు విపరీతమైన డిమాండ్‌ ఉందని, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా తయారీ చేపట్టనున్నామని మంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు. 

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో భారత్ అగ్రస్థానంలో ఉంది. టైర్‌-2, టైర్‌-3 నగరాల మధ్య విమాన రాకపోకలను మరింత సులభతరం చేయడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషించనుంది.  'ఉడాన్' వంటి పథకాల ద్వారా చిన్న నగరాలకు విమాన ప్రయాణాన్ని చేరువ చేస్తున్న క్రమంలో, ఎంబ్రయర్‌ వంటి సంస్థలతో భాగస్వామ్యం భారత రవాణా ముఖచిత్రాన్ని మార్చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ భాగస్వామ్యం వల్ల దేశంలో వేలాది మందికి ఉపాధి లభించడమే కాకుండా, విమాన ప్రయాణ ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Read More  బీజేపీతో పొత్తుండదు.. కమలం సైద్ధాంతిక శత్రువు..!!