సేవా యోధుడికి ఘన సన్మానం

విశ్వంభర, భద్రాచలం: లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ సంస్థల సీనియర్ సభ్యులు, గ్రీన్ భద్రాద్రి ట్రస్ట్ చైర్మన్  యేగి సూర్యనారాయణకు అమెరికా టెక్సాస్ రాష్ట్రానికి చెందిన డే స్ప్రింగ్ థియోలాజికల్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రదానం చేసిన సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం ,  గ్రీన్ భద్రాద్రి ట్రస్ట్ ఆధ్వర్యంలో జీయర్ మఠంలో ఘనంగా సన్మానించారు. దశాబ్దాలుగా ఏజెన్సీ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన నిరంతర సేవలు, సామాజిక బాధ్యత, మానవతా దృక్పథాన్ని గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో డాక్టరేట్ లభించడం భద్రాచలం పట్టణానికే గర్వకారణమని వక్తలు కొనియాడారు. విద్య, వైద్యం,పేదల సహాయం,ప్రకృతి పరిరక్షణ,సామాజిక సేవా కార్యక్రమాల్లో యేగి సూర్యనారాయణ చురుకైన పాత్ర పోషిస్తూ అనేక మందికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి ఎదిగి సేవనే లక్ష్యంగా జీవితం అంకితం చేసిన యేగి సూర్యనారాయణ లయన్స్ క్లబ్,రెడ్ క్రాస్ సంస్థల ద్వారా వేలాది మంది అవసరార్థులకు అండగా నిలిచారని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో విద్యార్థులకు విద్యా సహాయం, అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు వైద్య సహకారం,అత్యవసర పరిస్థితుల్లో సహాయ చర్యలు చేపట్టడంలో కీలక పాత్ర పోషించారని వక్తలు గుర్తుచేశారు. గ్రీన్ భద్రాద్రి ట్రస్ట్ ద్వారా పర్యావరణ పరిరక్షణ,సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ భవిష్యత్ తరాలకు హరిత భద్రాద్రిని అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు.అంతర్జాతీయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ రావడం యేగి సూర్యనారాయణ వ్యక్తిగత విజయమే కాకుండా భద్రాచలం ప్రాంతానికి వచ్చిన గౌరవమని,ఇలాంటి సేవాభావం కలిగిన వ్యక్తులు యువతకు స్ఫూర్తిగా నిలవాలని పలువురు నాయకులు ఆకాంక్షించారు. సన్మాన కార్యక్రమం జీయర్ మఠం ప్రాంగణంలో ఉత్సవ వాతావరణంలో సాగగా శాలువాలు,పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు పి.కమలా రాజశేఖర్, గ్రీన్ భద్రాద్రి అధ్యక్షురాలు చిట్టే లలిత,శ్రీరామా క్లబ్ అధ్యక్షులు చల్లగుళ్ళ నాగేశ్వరరావు,విద్యావేత్త టి.సిద్దులు,జి.యస్.శంకర్ రావు,కురిచేటి శ్రీనివాస్,గాదె మాధవరెడ్డి,పల్లింటి దేశప్ప,పరిమి సోమశేఖర్,జీయర్ మఠం అధ్యక్షులు జి.వెంకటాచారి,ఎం.సిద్దారెడ్డి,పార్క్ కృష్ణ,సి.హెచ్.రామలింగేశ్వర రావు,బి.వెంకటరెడ్డి,పిన్నింటి బాలాజీ,వాసు,ఉమాశంకర్ నాయుడు,నాగ సూర్యనారాయణ,ఎ.నరసింహాచారి,వీధుల రాంబా తదితరులు పాల్గొని యేగి సూర్యనారాయణకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు

Tags: