చెన్నైలో దివంగత ఎన్టీఆర్ నివాసానికి పూర్వవైభవం

త్వరలో అభిమానుల సందర్శనకు అనుమతి

చెన్నైలో దివంగత ఎన్టీఆర్ నివాసానికి పూర్వవైభవం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు సినీ ప్రస్థానంలో ఎన్నో మధుర స్మృతులకు వేదికైన చెన్నైలోని ఆయన నివాసం మళ్లీ కళకళలాడబోతోంది. త్యాగరాయనగర్‌ బజుల్లా రోడ్డులోని ఆ చారిత్రక ఇంటిని పునరుద్ధరించి, అభిమానుల సందర్శనార్థం సిద్ధం చేస్తున్నారు.

విశ్వంభర, నేషనల్ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు సినీ ప్రస్థానంలో ఎన్నో మధుర స్మృతులకు వేదికైన చెన్నైలోని ఆయన నివాసం మళ్లీ కళకళలాడబోతోంది. త్యాగరాయనగర్‌ బజుల్లా రోడ్డులోని ఆ చారిత్రక ఇంటిని పునరుద్ధరించి, అభిమానుల సందర్శనార్థం సిద్ధం చేస్తున్నారు. 1953లో ఎన్టీఆర్ తన సతీమణి బసవతారకం పేరిట సుమారు వెయ్యి గజాల విస్తీర్ణంలో ఈ ఇంటిని కొనుగోలు చేశారు. ఈ ఇల్లు ఆయనకు ఎంతో కలిసి వచ్చిందని సినీ వర్గాలు చెబుతుంటాయి.

ఈ ఇంటికి ఎదురుగానే దర్శకరత్న దాసరి నారాయణరావు నివాసం ఉండేది. రాత్రిళ్లు అక్కడ కథా చర్చలు జరిగేవి. ఎన్టీఆర్ తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేచి పనులు మొదలుపెట్టేవారు. అటు దాసరి ఇంట్లో అర్ధరాత్రి దాకా, ఇటు ఎన్టీఆర్ ఇంట్లో తెల్లవారుజాము నుంచి లైట్లు వెలుగుతూనే ఉండేవి. దీంతో ఆ వీధిలో దొంగతనాల భయం ఉండేది కాదని, ఏ ఇంటికీ వాచ్‌మన్ అవసరం పడేది కాదని అప్పట్లో సరదాగా చెప్పుకునేవారు.

Read More చిన్న‌స్వామి స్టేడియంలో మ‌ళ్లీ క్రికెట్ మ్యాచ్‌లు

తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలిరావడంతో ఆ ఇల్లు క్రమంగా కళావిహీనంగా మారింది. సుమారు 30 మందికి పైగా వారసులు ఉండటంతో ఆ ఇంటిని పునరుద్ధరించే ప్రయత్నాలు ఇన్నాళ్లూ కొలిక్కి రాలేదు. ప్రస్తుతం ఆ నివాసాన్ని నందమూరి కుటుంబానికి ఆప్తులైన చదలవాడ బ్రదర్స్ (తిరుపతిరావు, శ్రీనివాసరావు) కొనుగోలు చేశారు. ఎన్టీఆర్ జ్ఞాపకార్థం ఆ ఇంటిని తీర్చిదిద్దుతున్నట్లు వారు ప్రకటించారు.

ఇంటి అసలు రూపం దెబ్బతినకుండా కేవలం మరమ్మతులు మాత్రమే చేస్తున్నారు. ఇంటి ముందు ఉన్న ఫ్లైఓవర్ పైనుంచి వెళ్లేవారికి సైతం కనిపించేలా.. 'శ్రీకృష్ణపాండవీయం' చిత్రంలోని సుయోధనుడి గెటప్‌లో ఉన్న ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఇంటి ప్రధాన ద్వారంపై ఏర్పాటు చేస్తున్నారు. పనులు పూర్తయిన తర్వాత అభిమానులు లోపలికి వెళ్లి ఆ ఇంటిని చూసి ఆనందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Related Posts