KTR: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కాంగ్రెస్‌కి బుద్ధి చెప్పడం ఖాయం: కేటీఆర్
KTR: రాబోయే పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
రాబోయే పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత రెండేళ్లుగా పట్టణాలను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మొహం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రెండు సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి కూడా పట్టణాలకు విడుదల చేయని ఏకైక ప్రభుత్వంగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
కాంగ్రెస్ పాలనలో పట్టణాల పరిపాలన పూర్తిగా దెబ్బతిందని, పారిశుద్ధ్యం నుంచి తాగునీరు, రహదారులు, మౌలిక వసతుల వరకు ప్రతి అంశంలో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించి, నిధులు కేటాయించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేవలం మళ్లీ శిలాఫలకాలు వేయడం తప్ప ఈ ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమీలేదన్నారు. రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, మోడల్ మార్కెట్లు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు నిలిపివేయడంతో అవన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయని తెలిపారు.
ఒకవైపు వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టుతూ, మరోవైపు పట్టణాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని కేటీఆర్ అన్నారు. ఈ రెండేళ్లలో పట్టణాలకు ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి పనులను ప్రజల ముందుంచి ఓట్లు అడగాలని కాంగ్రెస్ నేతలకు ఆయన బహిరంగ సవాల్ విసిరారు.
మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే క్రమంలో భాగంగా కేటీఆర్ హైదరాబాద్‌లో నిజామాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పార్టీ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రానున్న పురపాలక ఎన్నికల వ్యూహాలు, పార్టీ చేయాల్సిన ఏర్పాట్లు, ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన అంశాలపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రెండు జిల్లాల్లోని ప్రతి మున్సిపాలిటీలోని క్షేత్రస్థాయి పరిస్థితులను కేటీఆర్ సమగ్రంగా సమీక్షించారు.
పంచాయతీరాజ్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలు, అధికార దుర్వినియోగాన్ని ఎదుర్కొని పార్టీ మంచి ఫలితాలు సాధించిందని గుర్తు చేసిన కేటీఆర్, అదే స్పూర్తితో మున్సిపల్ ఎన్నికల్లో మరింత మెరుగైన విజయాలు సాధించాలని నేతలకు సూచించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేత, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కూడా పాల్గొని, కలిసికట్టుగా సమిష్టిగా పోరాడితే విజయం తప్పక సాధ్యమని అన్నారు. పురపాలక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై హరీష్ రావు నేతలకు పలు సూచనలు చేశారు.
జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు హాజరైన ఈ సమావేశంలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను నేతలు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, పార్టీకి అనుకూల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోందని వారు నాయకత్వానికి తెలియజేశారు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలనే సంకల్పంతో పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయని సమావేశంలో స్పష్టం అయ్యింది.



