ట్రంప్–మోదీ మధ్య దూరం సహజమే: అమెరికా రాయబారి
విశ్వంభర, నేషనల్ బ్యూరో: భారత్–అమెరికా సంబంధాలపై నూతన అమెరికా రాయబారి సెర్గియో గోర్ స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: భారత్–అమెరికా సంబంధాలపై నూతన అమెరికా రాయబారి సెర్గియో గోర్ స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న స్నేహబంధం నిజమైనదేనని ఆయన తెలిపారు. నిజమైన స్నేహితుల మధ్య భేదాభిప్రాయాలు రావడం సహజమని, ట్రంప్–మోదీ మధ్య కనిపిస్తున్న విభేదాలను కూడా అదే కోణంలో చూడాలన్నారు. ఆ విభేదాలను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకుని ముందుకు సాగేందుకు ఇద్దరు నేతలు ప్రయత్నిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
భారత్‌కు అమెరికా రాయబారిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మాట్లాడిన సెర్గియో గోర్, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలుస్తోందని పేర్కొన్న ఆయన, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు వాణిజ్యం కీలకమైన పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. అందుకే వాణిజ్య భాగస్వామ్యాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా కుదుర్చుకునే దిశగా రెండు దేశాల ప్రతినిధులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారని గోర్ వెల్లడించారు. వాణిజ్యంతో పాటు భద్రత, సాంకేతికత, ఆరోగ్యం, ఇంధనం వంటి కీలక రంగాల్లోనూ భారత్–అమెరికా మధ్య పరస్పర సహకారం కొనసాగుతుందని చెప్పారు. ఈ అన్ని రంగాల్లోనూ భారత్ తమకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని ఆయన స్పష్టం చేశారు.
వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మరింత పురోగతి సాధించేందుకు జనవరి 13న ఇరు దేశాల ప్రతినిధులు మరోసారి సమావేశం కానున్నట్లు సెర్గియో గోర్ తెలిపారు. ఈ చర్చలు భారత్–అమెరికా సంబంధాలకు కొత్త దిశానిర్దేశం చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.



